

మెటా మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజెర్ ఇన్‌స్టాగ్రామ్ చైల్డ్ సేఫ్టీ విధానాలపై అమెరికా ఫెడరల్ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. విచారణ రెండో రోజు కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన ఆయన.. 13 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ ‘డోంట్ ఆస్క్.. డోంట్ టెల్’ విధానాన్ని అనుసరించిందని ఆరోపించారు. అంటే, పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నట్లు తెలిసినా వారి వయసును నిర్ధారించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
కొత్త టూల్స్ అభివృద్ధి సమయంలో భద్రత కంటే యూజర్లు యాప్‌లపై గడిపే సమయం, ఎంగేజ్‌మెంట్, లాభాలకే మెటా ప్రాధాన్యం ఇచ్చిందని బెజెర్ ఆరోపించారు. 13 ఏళ్లలోపు పిల్లలు పెద్ద సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. ఫేక్ ఖాతాలను గుర్తించేందుకు మెటా వద్ద అధునాతన టూల్స్ ఉన్నప్పటికీ, వినియోగదారుల వయసును కచ్చితంగా నిర్ధారించేందుకు తగిన వ్యవస్థలు లేవని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను మెటా ఖండించింది.
బెజెర్ 2009 నుంచి 2015 వరకు ఫేస్‌బుక్‌లో పనిచేశారు. అనంతరం 2019 నుంచి 2021 వరకు మెటా యాప్స్ భద్రతకు సంబంధించిన అంశాలపై కాంట్రాక్టర్‌గా పనిచేశారు. 2023లో అమెరికా కాంగ్రెస్ విచారణలోనూ మెటాపై పలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా యాప్స్ వల్ల పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న విషయం కంపెనీ ఉన్నతాధికారులకు తెలుసని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.
చిన్నారులు, టీనేజర్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు బానిసలయ్యేలా మెటా ఉద్దేశపూర్వకంగా వాటిని రూపొందించిందంటూ అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా ఓక్‌లాండ్ ఫెడరల్ కోర్టులో దావా వేశాయి. యూజర్లు ఎక్కువ సమయం యాప్‌లలో గడిపేలా చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, సంబంధిత వాస్తవాలను దాచడం మెటా వ్యాపార విధానంలో భాగమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ ఓనెయిల్ ఆరోపించారు. కేసులో మెటాకు ప్రతికూల తీర్పు వస్తే భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!