

చాలా కాలం తర్వాత దర్శకుడు శ్రీవాస్ ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఫినిక్స్ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మాధవి క్రియేషన్స్ పతాకంపై మహాంకాళి నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ద్విమితీయ చలన టీజర్ తాజాగా విడుదలైంది. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భాంబురే, శ్యామ్ బోడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సమాజం బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ.. దాని వెనుక డ్రగ్ మాఫియా, కార్పొరేట్ వ్యవస్థ, రాజకీయ అధికారం మధ్య జరుగుతున్న పోరును టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు.
యువత భవిష్యత్తును తమకు అనుకూలంగా మలచుకునేందుకు కొన్ని శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనే ఓ వ్యక్తి చుట్టూ కథ సాగనున్నట్లు టీజర్ సూచిస్తోంది. అతడి పోరాటానికి న్యాయ వ్యవస్థతో పాటు నిజాయితీగల కొందరు వ్యక్తులు అండగా నిలుస్తారని తెలుస్తోంది. ‘జీరో టు ఎంపైర్’, ‘డిస్ట్రాయ్డ్ బై సిస్టమ్.. రీబార్న్ బై హిమ్‌సెల్ఫ్’ వంటి వాక్యాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సూట్‌లో ఉన్న ఓ వ్యక్తి వెనుక భారీ ఫినిక్స్ పక్షి కనిపించినప్పటికీ.. అతడి ముఖాన్ని మాత్రం చూపించలేదు. హీరో, హీరోయిన్ వివరాలను కూడా వెల్లడించకపోవడంతో అసలు కథానాయకుడు ఎవరనే సస్పెన్స్ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!