

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. పవన్ కల్యాణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం సినిమా షూటింగ్ ప్రారంభం కావడంలో ఆలస్యం కావడం వల్లే ప్రాజెక్ట్ నుంచి వైదొలిగానని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం ‘భోగి’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు తొలుత సంపత్ నందినే దర్శకుడిగా ఎంపికయ్యారు. అయితే పవన్ కల్యాణ్ ఇతర సినిమా కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో షూటింగ్ ప్రారంభం ఆలస్యమైంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్వయంగా తనను పిలిచి, సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని, అప్పటివరకు వేచి ఉండగలరా అని అడిగినట్లు సంపత్ నంది తెలిపారు. అందుకు సమాధానంగా ఈ విరామంలో మరో సినిమా పూర్తి చేసుకుంటే అభ్యంతరం లేదని పవన్‌ను అడిగానని చెప్పారు. పరస్పర అంగీకారంతో ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేకుండానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని వివరించారు. తనతో సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ చివరి వరకు ప్రయత్నించారని నిర్మాతల ద్వారా తెలుసుకున్నానని, ఇతరులను ఎక్కువ కాలం వేచి ఉండేలా చేయడం ఆయనకు ఇష్టం ఉండదని సంపత్ నంది పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!