

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘మహారాజ’ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు అందుకుంటోంది. 2024లో విడుదలైన ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, నటరాజ్ సుబ్రమణ్యం, సచనా నామిదాస్ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా బాలనటి సచనా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆమె కనబరిచిన ప్రతిభకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ సైతం ‘మహారాజ’ చిత్రాన్ని చూసి సచనా నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా వెల్లడించారు.
ఈ ఏడాది ప్రారంభంలో లాస్ ఏంజెలెస్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (LACMA) గాలా కార్యక్రమంలో టామ్ హ్యాంక్స్ తనకు మూడు భారతీయ సినిమాలను సూచించమని అడిగారని కవితా గుప్తా తెలిపారు. అప్పుడు తాను ‘మహారాజ’ చిత్రాన్ని చూడాలని సూచించానన్నారు. నవంబర్ 7న మరోసారి జరిగిన LACMA కార్యక్రమంలో కలిసినప్పుడు టామ్ హ్యాంక్స్ స్వయంగా ‘మహారాజ’ గురించి ప్రస్తావించారని చెప్పారు. సినిమాలో ఆ అమ్మాయి నటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని, ఆమె అద్భుతమైన నటి అని ఆయన ప్రశంసించినట్లు కవితా గుప్తా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను ఇటీవల ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల కార్యక్రమం సందర్భంగా విజయ్ సేతుపతితో జరిగిన సంభాషణలో ఆమె గుర్తుచేసుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!