

‘కుక్ విత్ కోమలి’ టెలివిజన్ షో ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత హీరోగా వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోలీవుడ్ యువ నటుడు అశ్విన్ కుమార్ ఓ ఇంటివాడయ్యారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఆయన వివాహం చేసుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘ఓ కాదల్ కన్మణి’, ‘ఆదిత్య వర్మ’, ‘సెంబి’, ‘మీట్ క్యూట్’, ‘హాట్ స్పాట్ 2 మచ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన అశ్విన్, తాజాగా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. దివంగత ప్రముఖ దర్శకుడు రాజశేఖర్ మనవరాలు భువనేశ్వరితో ఆయన కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వీరి వివాహ వేడుక కోయంబత్తూరులో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే పెళ్లి గురించి అశ్విన్ కుమార్ ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చిన తర్వాతే అభిమానులకు ఈ విషయం తెలిసింది. దీంతో సినీ ప్రియులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం అశ్విన్ కుమార్, భువనేశ్వరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ఈ కొత్త జంట ఎంతో అందంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు నూతన వధూవరులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!