

‘ధురంధర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ తన సక్సెస్ క్రెడిట్‌ను భార్య, నటి యామీ గౌతమ్‌కు ఇచ్చారు. తాజాగా జరిగిన సీఎన్ఎన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డుల వేడుకలో ఈ జంట భారతీయ సినిమాకు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రత్యేక గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన ఆదిత్య ధర్ తన 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తాను ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారడానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టిందని తెలిపారు. 2006లో సినిమా రంగంలో స్థిరపడాలనే కలతో ముంబైకి వచ్చానని, దర్శకుడిగా ఎదగడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, పాటల రచయితగా, డైలాగ్ రైటర్‌గా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత తనకు గుర్తింపు వచ్చిందని వివరించారు.
2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై జాతీయ అవార్డును అందుకున్న ఆదిత్య ధర్.. ‘ధురంధర్’ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యామీ గౌతమ్ తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన అదృష్టం మారిపోయిందని, ఆమె తన లేడీ లక్ అని భావోద్వేగంగా చెప్పారు. ఆమె అందించిన ప్రోత్సాహం, మద్దతు వల్లే భారతీయ కథలను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయగలుగుతున్నానని కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు యామీ కూడా తన భర్తపై ప్రశంసలు కురిపించారు. సినీ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లు కొందరిని కఠినంగా మార్చేస్తాయని, అయితే ఆదిత్య మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తన మంచితనాన్ని, సానుకూల దృక్పథాన్ని కోల్పోలేదని అన్నారు. అవార్డుల వేడుకలో ఈ జంట ఒకరిపై మరొకరు వ్యక్తం చేసిన ప్రేమ, అభిమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!