

ప్రస్తుతం క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనేక మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవలి కాలంలో నోటి క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నోటి క్యాన్సర్ అనేది ప్రధానంగా పెదవులు, నాలుకపై ప్రారంభమయ్యే ఒక రకం క్యాన్సర్‌గా గుర్తించబడుతోంది. ఇది పెదవులు, నాలుక, చిగుళ్లు, బుగ్గల లోపలి భాగం, నోటిలోని పొరలు అలాగే గొంతు వెనుక భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నోటి క్యాన్సర్ ఎక్కువగా పొగాకు, పాన్, గుట్కా నమలడం, ధూమపానం మరియు మద్యం సేవించడం వలన వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 60 శాతానికి పైగా పొగాకు, మద్యం వినియోగంతో సంబంధం ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్లలో 62 శాతానికి మించి ఈ అలవాట్లే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఆల్కహాల్ శరీరంలో అసిటాల్డిహైడ్ అనే విషపూరిత పదార్థాన్ని ఉత్పత్తి చేసి నోటి కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే వీలైనంతవరకు మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు సాధారణంగా చిన్న పుండుతో మొదలవుతాయి. మొదట పెదవులు లేదా చిగుళ్లపై ఏర్పడిన పుండు క్రమంగా తగ్గకుండా నాలుక, బుగ్గల లోపలి భాగాలకు వ్యాపించే అవకాశముంటుంది. కొన్నిసార్లు దవడ భాగంలో కూడా పుండులా కనిపించవచ్చు. అలాగే నాలుక, చిగుళ్లు లేదా నోటి పొరపై తెల్లటి లేదా ఎరుపు రంగు మచ్చలు కనిపించడం కూడా నోటి క్యాన్సర్‌కు ప్రారంభ సంకేతంగా వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు రెండు వారాలకుపైగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!