

యువతలో పరగడుపున రక్తంలో చక్కెర స్థాయులు క్రమంగా పెరగడం నడివయసులో జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. యువకులను మూడు దశాబ్దాలకు పైగా పరిశీలించిన పరిశోధకులు.. గ్లూకోజ్ జీవక్రియలో చోటుచేసుకునే మార్పులు ఊహించిన దానికంటే ముందుగానే మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. టైప్-2 మధుమేహం ఉన్నవారిలో మెదడు నిర్మాణంలో మార్పులు కనిపించాయి. సాధారణంగా మధుమేహం కారణంగా వచ్చే మెదడు సంబంధిత సమస్యలు 65 ఏళ్ల తర్వాతే మొదలవుతాయని భావించేవారు. అయితే, మధుమేహం లేకపోయినా ప్రీ-డయాబెటిస్ లేదా నిరంతరం అధిక రక్తంలో చక్కెర స్థాయులు ఉన్నవారిలో భవిష్యత్తులో డిమెన్షియా ముప్పు పెరిగే అవకాశం ఉందని ప్రధాన పరిశోధకురాలు రెజీనా పారడెలా వెల్లడించారు.
ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 3,000 మంది యువకుల ఆరోగ్య సమాచారాన్ని, వారిలో 605 మందికి సంబంధించిన ఎంఆర్‌ఐ స్కాన్లను విశ్లేషించారు. రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నవారు, మధుమేహంతో బాధపడుతున్నవారు జ్ఞాపకశక్తి పరీక్షల్లో తక్కువ ప్రతిభ కనబరిచినట్లు పరిశోధకులు గుర్తించారు. వీరి మెదడులో గ్రే మ్యాటర్ పరిమాణం తగ్గడంతో పాటు వైట్ మ్యాటర్‌లో అసాధారణ మార్పులు చోటుచేసుకున్నట్లు స్కాన్లలో వెల్లడైంది. ఈ పరిణామాలు దీర్ఘకాలంలో మెదడు నిర్మాణం, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చని అధ్యయనం సూచిస్తోంది. అందువల్ల 18 నుంచి 30 ఏళ్ల వయసు నుంచే రక్తంలో చక్కెర స్థాయులను క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ, ఆరోగ్యకరమైన స్థాయుల్లో ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!