

దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన పీఎం2.5 కాలుష్య కణాలు ఊపిరితిత్తులకే కాకుండా మూత్రపిండాల ఆరోగ్యానికీ హాని కలిగించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మోహిత్ ఖిర్బత్ వివరాల ప్రకారం.. ఈ సూక్ష్మ కణాలు శరీరంలోకి ప్రవేశించడం వల్ల వాపు, ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల కిడ్నీలకు రక్త సరఫరా తగ్గి, రక్తంలోని వ్యర్థాలను వడపోసే సామర్థ్యం ప్రభావితమవుతుంది. దీర్ఘకాలం పాటు పీఎం2.5 కాలుష్యానికి గురికావడం వల్ల మెంబ్రేనస్ నెఫ్రోపతీ వంటి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ముప్పు కూడా పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీలో ప్రచురితమైన పరిశోధనలో సుమారు 25 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం2.5 కాలుష్య సాంద్రత 10 మైక్రోగ్రాములు పెరిగినప్పుడు కొత్తగా కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం 25 నుంచి 37 శాతం వరకు పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. కిడ్నీల పనితీరు వేగంగా క్షీణించే ప్రమాదం 36 శాతం, డయాలసిస్ అవసరమయ్యే పరిస్థితికి చేరే ప్రమాదం 31 శాతం పెరిగినట్లు పేర్కొంది. తైవాన్, దక్షిణ కొరియా, యూరప్‌లో నిర్వహించిన పరిశోధనల్లోనూ ఇలాంటి సంబంధాలు గుర్తించారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయటకు వెళ్లడం తగ్గించడం, అవసరమైతే సరైన ఫిట్‌తో కూడిన ఎన్95 మాస్క్ ధరించడం, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిదని చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!