

దేశీయ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) జుగేశిందర్ రాబీ సింగ్ వెల్లడించారు. శుక్రవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత్‌లో విమాన ప్రయాణాలకు భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో 60 కోట్ల మందికి పైగా విమాన ప్రయాణాలు చేసే సామర్థ్యం ఉందని, భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌ను అందుకోవాలంటే రోజువారీ విమానాల సంఖ్య ప్రస్తుత స్థాయి కంటే దాదాపు పది రెట్లు పెరిగి 30 వేలకు చేరాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. విమానయాన రంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానయాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం లేదా కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం ద్వారా అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో టాటా గ్రూప్‌పై కూడా సింగ్ ప్రశంసలు కురిపించారు. భారతీయ కార్పొరేట్ సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో సగం భారతీయ సంస్థలే ఉండాలన్నది అదానీ గ్రూప్ ఆకాంక్షగా పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ తాజా ప్రకటన గతంలో వెల్లడించిన వైఖరికి భిన్నంగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది జులైలో విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచన లేదని గ్రూప్ ప్రకటించింది. నవంబర్ 3న అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ సీఈఓ అరుణ్ బన్సాల్ సైతం సొంత విమానయాన సంస్థను ప్రారంభించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు తమ వినియోగదారులతోనే పోటీ పడటం సరైన వ్యాపార వ్యూహం కాదని అప్పట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ దేశవ్యాప్తంగా ముంబయి, నవీ ముంబయి, అహ్మదాబాద్, లఖ్‌నవూ, గువాహటి సహా ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం విమాన ప్రయాణికుల రాకపోకల్లో ఈ విమానాశ్రయాల వాటా నాలుగో వంతుకు పైగా ఉంది. మరోవైపు స్పైస్‌జెట్ కూడా ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునేందుకు రూ.5,500 కోట్ల వరకు నిధులు సమీకరించాలని నిర్ణయించింది. నవంబర్ 18న ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. అధీకృత మూలధనాన్ని రూ.2,000 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. సమీకరించిన నిధులను ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, విమానాల సంఖ్య పెంచడం, కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసం వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!