

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వర్షాలు లేక నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేదని, మంత్రులు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగడంపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లో శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు పడిపోయే అవకాశం ఉందని, అప్పుడు రాయలసీమకు నీటిని అందించడం కష్టమవుతుందని అన్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు 52 శాతం లోటు వర్షపాతం నమోదైందని, 688 మండలాలకు గాను 628 మండలాల్లో లోటు వర్షపాతం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని గుర్తించేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని జగన్ ఆరోపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!