

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లోని చైతన్య విహార్‌లో ఉన్న ఓ సంస్కృత పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూగర్భ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన విద్యార్థులు విషవాయువు పీల్చడంతో నలుగురు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశిష్ కుమార్ శర్మ ఈ గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో దాదాపు 100 మంది క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో వాటర్ ట్యాంక్ నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు దాన్ని శుభ్రం చేయాలని నిర్ణయించారు.
సుమారు 12 నుంచి 14 అడుగుల లోతున్న ట్యాంక్‌లోని నీటిని మోటార్ సాయంతో బయటకు పంపించారు. కొంత నీరు మిగిలిపోవడంతో ఓ విద్యార్థి ట్యాంక్‌లోకి దిగగా, కొద్దిసేపటికే విషవాయువు ప్రభావంతో స్పృహ కోల్పోయాడు. అతడిని రక్షించేందుకు మరో నలుగురు విద్యార్థులు ఒక్కొక్కరుగా ట్యాంక్‌లోకి దిగడంతో వారు కూడా విషవాయువును పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొత్తం ఐదుగురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. రుద్ర అనే విద్యార్థి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను మార్చురీకి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!