

నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణా జలాలను కరవు పీడిత ప్రాంతాలకు తీసుకెళ్లే చారిత్రాత్మక వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం కావడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో మార్కాపురం, ప్రకాశం, కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజల కల సాకారమైందని పేర్కొన్నారు. తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుందని తెలిపారు. ప్రాజెక్టు కోసం మూడు దశాబ్దాలుగా కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలు, ఇతర భాగస్వాములకు ఆయన అభినందనలు తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు కోసం 7,300 మందికి పైగా ప్రజలు ఇళ్లు, భూములు కోల్పోయి నిర్వాసితులయ్యారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వారి పరిహారం కోసం కూటమి ప్రభుత్వం రూ.905 కోట్లు విడుదల చేయగా, ఇప్పటికే రూ.768 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఆయన నాయకత్వంలోనే తొలి దశ ప్రారంభం కావడం విశేషమని అన్నారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని మెగా వాటర్ గ్రిడ్ పథకానికి వెలిగొండ ప్రధాన నీటి వనరుగా నిలుస్తుందని, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని చెప్పారు. ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, నిర్వాసితులకు పవన్ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!