

మార్కాపురం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం అభివృద్ధికి కొత్త అధ్యాయమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వలసల కష్టాలకు ముగింపు పలికి, కరవు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సహకరించిన నిర్వాసితుల త్యాగాలను ఆయన గుర్తుచేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 30 ఏళ్ల కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని లోకేష్ వెల్లడించారు.
కరవు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మార్కాపురం ప్రాంత ప్రజలకు రక్షిత తాగునీరు అందించడంతో పాటు, సాగునీటి సౌకర్యాలు కల్పించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని లోకేష్ తెలిపారు. నీటి వసతుల ద్వారా వ్యవసాయంతో పాటు ఉద్యానవన సాగు అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో పనిచేస్తోందని, ప్రజలకు మేలు చేయడం ద్వారా వారి అభిమానాన్ని పొందడమే తమకు కావాల్సిన గుర్తింపని స్పష్టం చేశారు. “వెలిగొండ జలసిరులు.. అభివృద్ధికి రెక్కలు” అనేది కేవలం నినాదం కాదని, ప్రభుత్వ విధానమని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!