

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ జోరు కొనసాగుతోంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స ప్రకారం.. గత ఆరు నెలల్లో కంపెనీ ఈవీ బుకింగ్స్ మూడు రెట్లు పెరిగాయి. గత రెండు, మూడు నెలలుగా ప్రతి నెలా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నామని, రెండో స్థానంలో ఉన్న సంస్థతో తమకు ఉన్న అంతరం కూడా పెరిగిందని ఆయన తెలిపారు. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను అందించడంలో ఉత్పత్తి సామర్థ్యం పరిమితిగా మారుతోందని పేర్కొన్నారు.
వినియోగదారుల్లో టాటా ఈవీలపై నమ్మకం పెరుగుతోందని, విభిన్న అవసరాలకు అనుగుణంగా విస్తృత ఉత్పత్తి శ్రేణి తమకు కలిసొస్తోందని శ్రీవత్స తెలిపారు. రానున్న పండగ సీజన్‌పై కంపెనీ ఆశావహంగా ఉంది. జూన్ త్రైమాసికంలో భారత ప్యాసింజర్ వాహన పరిశ్రమ వార్షిక ప్రాతిపదికన సుమారు 46 శాతం వృద్ధి చెందగా, ఈవీ విభాగం 77 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన వెల్లడించారు. జూలై, ఆగస్టులోనూ ఇదే జోరు కొనసాగిందని, సెప్టెంబర్-డిసెంబర్ త్రైమాసికం పరిశ్రమకు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచి కార్ల ధరల పెంపు పండగ సీజన్ డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!