

ఇరాన్ చమురు ఎగుమతుల విషయంలో అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరించారనే ఆరోపణలతో భారత వ్యాపారవేత్త సునీల్ కుమార్ శర్మ, ఆయన భార్య జస్‌ప్రీత్ ప్రీతి షాహిద్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. వీరితో పాటు మరో ఇద్దరు భారతీయులు, భారత్‌లోని పలు సంస్థలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. శర్మకు సంబంధం ఉన్న తొమ్మిది సంస్థలపైనా ఈ చర్యలు తీసుకుంది. ఇరాన్ పెట్రోలియం రవాణా వ్యవస్థలో భాగంగా ఉంటూ, ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న నౌకలకు తప్పుడు గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలు అందించడంలో వీరు సహకరించారని అమెరికా ట్రెజరీ విభాగం ఆరోపించింది. ఇరాన్ సైన్యం, దాని అనుబంధ సంస్థలకు చెందిన నౌకలకు కూడా ఇలాంటి సేవలు అందించినట్లు పేర్కొంది.
ఇరాన్ ఆర్థిక వనరులను పరిమితం చేసి, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలనే లక్ష్యంతో అమెరికా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరిట ఆంక్షలను అమలు చేస్తోంది. ఇరాన్ ప్రభుత్వానికి సహకరించే వ్యక్తులు, సంస్థలపైనా చర్యలు తప్పవని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. ఈ క్రమంలోనే తుర్కియేకు చెందిన ఫుగో గ్రౌండ్ సర్వీసెస్ సంస్థను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ విమానయాన రంగానికి ఈ సంస్థ మద్దతు ఇస్తోందన్నది అమెరికా ఆరోపణ. ఇరాన్ పాలనకు మద్దతు ఇచ్చేవారిని గుర్తించి వారిపై ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల అనంతరం ఈ తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!