

అంతరిక్ష పరిశోధనలో మరో కీలక పోటీకి తెరలేస్తోంది. అమెరికా, రష్యా, చైనాలు చంద్రుడిపై అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరాల నిర్మాణం, వనరుల అన్వేషణ, భవిష్యత్ లోతైన అంతరిక్ష యాత్రలకు అణుశక్తి కీలకమని ఈ దేశాలు భావిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో 2030 డిసెంబరు నాటికి నిరంతరం పనిచేసే అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు చైనాతో కలిసి 2036 నాటికి ‘సెలీనా’ పేరుతో అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేసేందుకు రష్యా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రుడిపై రాత్రి సమయం ఎక్కువగా ఉండటం వల్ల సౌరశక్తిపై పూర్తిగా ఆధారపడటం కష్టం. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం విద్యుత్ అందించగల అణు రియాక్టర్లు శాశ్వత స్థావరాలకు కీలకంగా మారనున్నాయి. నాసా ప్రతిపాదించిన లూనార్ రియాక్టర్-1 సుమారు 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఐదేళ్ల వరకు పనిచేయగలదని అంచనా వేస్తున్నారు. రష్యా ప్రతిపాదిస్తున్న సెలీనా రియాక్టర్ 10 కిలోవాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు పదేళ్లపాటు స్వయంప్రతిపత్తితో పనిచేయగలదని సమాచారం.
అయితే చంద్రుడిపై అణు రియాక్టర్ల ఏర్పాటుపై భద్రత, అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాకెట్ ప్రయోగాల్లో వైఫల్యం లేదా ఇతర ప్రమాదాల కారణంగా రేడియోధార్మిక పదార్థాలు వ్యాపించే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చంద్రుడిపై వ్యోమగాములు, రోవర్లు, ఇతర పరికరాలను రేడియేషన్ నుంచి రక్షించేందుకు ప్రత్యేక భద్రతా వ్యవస్థలు అవసరమవుతాయి. ప్రయోగ సమయంలో ప్రమాదాలను తగ్గించేందుకు రియాక్టర్లను పూర్తిగా నిష్క్రియాత్మక స్థితిలో చంద్రుడిపైకి తీసుకెళ్లాలని అమెరికా, రష్యాలు భావిస్తున్నాయి. మరోవైపు 1967 నాటి అంతరిక్ష ఒప్పందం ప్రకారం చంద్రుడిపై ఏ దేశమూ సార్వభౌమ హక్కు ప్రకటించకూడదు. అయితే అక్కడ ఏర్పాటు చేసే స్థావరాల చుట్టుపక్కల ప్రాంతాలపై నియంత్రణ, చంద్రుడి వనరుల వినియోగం వంటి అంశాలపై స్పష్టత ఇంకా పూర్తిగా లేదు. అణు రియాక్టర్ల ఆధారంగా ఏర్పడే స్థావరాలు నియంత్రిత ప్రాంతాలుగా మారే అవకాశంపై అమెరికాకు ఆందోళనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ ప్రతిపాదనల దశలోనే ఉండగా.. వాటిని చంద్రుడిపై సురక్షితంగా ఏర్పాటు చేసి, దీర్ఘకాలం నిర్వహించగల సామర్థ్యాన్ని ఆయా దేశాలు నిరూపించాల్సి ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!