

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రా మాజీ చీఫ్ సామంత్ గోయల్‌కు సమన్లు అందజేసేందుకు అమెరికాలోని ఫెడరల్ కోర్టు దిల్లీ న్యాయస్థానం సహకారం కోరింది. ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన సివిల్ దావా విచారణలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. తనను హతమార్చేందుకు భారత అధికారులు కుట్ర పన్నారంటూ పన్నూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు అందించేందుకు భారత్‌లోని సంబంధిత న్యాయస్థానం సహకరించాలని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి కేథరిన్ పొలాక్ ఫిల్లా కోరారు. ఈ మేరకు సమన్లను ఇప్పటికే దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు పంపించారు.
పన్నూ చేసిన ఆరోపణలపై అమెరికా కోర్టులో న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే అజిత్ డోభాల్, సామంత్ గోయల్‌కు అధికారికంగా నోటీసులు అందించేందుకు అమెరికా న్యాయస్థానం ప్రయత్నిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అజిత్ డోభాల్, రా మాజీ చీఫ్ సామంత్ గోయల్‌పై పన్నూ చేసిన ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, పూర్తిగా నిరాధారమైనవని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు తీసుకున్న తాజా చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!