

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పొరబడిన పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. సహారన్‌పుర్ సర్క్యూట్ హౌస్‌లో బస చేసేందుకు ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రావాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఆయన రాలేకపోయారు. అదే సమయంలో అక్కడ బస చేస్తున్న ఒవైసీని న్యాయమూర్తిగా భావించిన పోలీసులు ప్రోటోకాల్ ప్రకారం గౌరవ వందనం సమర్పించారు. ఈ ఘటనపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని సహారన్‌పుర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఒవైసీకి చెందిన ఎంఐఎం, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో కలిసి ‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ను ఏర్పాటు చేశాయి. ఈ కూటమి ప్రచారంలో భాగంగా ఒవైసీ యూపీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో దోపిడీలు పెరిగిపోయాయని, చట్టపాలన బలహీనపడిందని, తుపాకీ రాజ్యం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ‘హైదరాబాదీ బిర్యానీ’పై ఎస్పీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపైనా ఒవైసీ స్పందించారు. కొందరు తినడం కోసమే బతుకుతారని, తాము బతకడం కోసం తింటామని పేర్కొంటూ, ఇది ఆహారానికి సంబంధించిన అంశం కాదని, ప్రజల జీవితాలను కాపాడటమే ముఖ్యమని అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!