

అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ సమీపంలో రెండు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఒకే ఫ్లైట్ నంబర్‌తో గగనతలంలోకి రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఫీనిక్స్ స్కైహార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆగస్టు 14న అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు బోయింగ్ 737-800 విమానాలు అమెరికన్ 2482 అనే ఒకే కాల్‌సైన్‌తో ప్రయాణించాయి. ఒక విమానం చికాగో నుంచి ఫీనిక్స్‌కు చేరుతుండగా, మరో విమానం ఫీనిక్స్ నుంచి చికాగోకు బయల్దేరింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఆలస్యం ఈ అసాధారణ పరిస్థితికి కారణమైనట్లు తెలుస్తోంది.
రెండు విమానాలు ఒకే గగనతలంలోకి చేరుతున్న విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే గుర్తించి, చాకచక్యంగా వేర్వేరు సూచనలు ఇచ్చారు. ఒక విమానాన్ని ఎక్కువ ఎత్తులో, మరో విమానాన్ని తక్కువ ఎత్తులో ప్రయాణించేలా ఆదేశించడంతో రెండూ సురక్షితంగా ఒకదానినొకటి దాటాయి. 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తనకు ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని కంట్రోలర్ వెల్లడించినట్లు సమాచారం. ఒకే కాల్‌సైన్ రెండు విమానాలకు ఎలా కేటాయించబడిందనే అంశంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), అమెరికన్ ఎయిర్‌లైన్స్ దర్యాప్తు చేస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!