

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరించేందుకు టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో నిర్వహించిన గ్రూప్ సూపర్వైజర్ల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, శ్రీవారి సేవను మరింత విస్తరించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 50 వేల ఆలయాల్లో భక్తులకు సేవలందించే అవకాశాలను గుర్తించి టీటీడీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే సేవకులకు ముందుగానే బోధిస్తే వారు మరింత నాణ్యమైన సేవలు అందించగలరని ఈవో పేర్కొన్నారు. అలాగే తిరుమలకు మాత్రమే కాకుండా గ్రామాలు, పట్టణాల్లోని స్థానిక ఆలయాల్లో కూడా శ్రీవారి సేవను విస్తరించేలా సేవకులను ప్రోత్సహించాలని సూచించారు. సేవకుల పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ విధానం అమలు చేసి, అదే ఆధారంగా విధులు కేటాయించే ప్రణాళికలను టీటీడీ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రూప్ సూపర్వైజర్ల నుంచి సూచనలు స్వీకరించి, భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!