

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలనుకునే వారికి ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు ప్రకటించింది. అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ కొత్త ‘ప్రభుత్వ సాయంపై ఆధారపడే వ్యక్తి’ నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి 2026 సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా దరఖాస్తుదారులు స్వయం సమృద్ధిగా ఉండేలా చూడడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. 2026 సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే శాశ్వత నివాస అనుమతి దరఖాస్తులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తుదారుల ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, ఆస్తులు, ఆర్థిక వనరులు, విద్య, నైపుణ్యాలను అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించనున్నారు.
సెప్టెంబర్ 18 తర్వాత ఆహార కూపన్లు, గృహ వసతి సాయం, విద్యా సంబంధిత ఆర్థిక సహాయం వంటి కొన్ని ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం గ్రీన్ కార్డ్ దరఖాస్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే కేవలం నిరుద్యోగం లేదా వయస్సు ఆధారంగా దరఖాస్తును తిరస్కరించరు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సాయంపై ఆధారపడకుండా ఉంటామనే హామీ పత్రాన్ని సమర్పించే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు లేదా ఆర్థిక ప్రాయోజకులు ఆర్థికంగా అండగా నిలవగలరని నిరూపించడంలో విఫలమైతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నిబంధనలు ప్రధానంగా కుటుంబ, ఉద్యోగ ఆధారిత శాశ్వత నివాస అనుమతి దరఖాస్తులకు వర్తిస్తాయి. అయితే శరణార్థులు, ఆశ్రయం పొందిన వారు, ఇప్పటికే శాశ్వత నివాస అనుమతి కలిగి ఉన్నవారు, కొన్ని ప్రత్యేక మానవతా వీసా వర్గాలకు మినహాయింపులు ఉంటాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!