

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ముందుగానే తెలిసినా ప్రభుత్వం తగిన కార్యాచరణ చేపట్టలేదని ఆరోపించారు. ఫిబ్రవరి 4నే ఎల్‌నినో ప్రభావంపై సమాచారం ఉన్నప్పటికీ వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. సాగునీరు అందుతుందనే ప్రభుత్వ హామీలను నమ్మి సాగులోకి దిగిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లిందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై జగన్ గతంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నాయని జగన్ ఆరోపించారు. పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. పోలవరం ఎత్తు విషయంలో రాజీ పడటం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్ పథకాలు గతంలోనే ఉన్నప్పటికీ వాటిని నిర్వహించి కొత్తగా నీరు తెచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రైతులకు ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయిందని, కరువు సమయంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!