

రాష్ట్రంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సరఫరా తగ్గిపోవడంతో హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.60 వరకు పలుకుతోంది. తెల్ల ఉల్లి ధర మరింత ఎక్కువగా ఉండి కిలో రూ.100 వరకు చేరింది. ఇటీవల హైదరాబాద్‌లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 16 నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి సగటు రిటైల్ ధర కిలో రూ.53.84గా నమోదైందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే సమయంలో రూ.27.71గా ఉన్న ధరతో పోలిస్తే దాదాపు 94 శాతం పెరుగుదల నమోదైంది.
ఉల్లి సరఫరా తగ్గడానికి ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు, కీలక ఉత్పత్తి ప్రాంతాల్లో దిగుబడి తగ్గడం కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణకు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి ఉల్లి సరఫరా అవుతుంది. ఈ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పంట దిగుబడి, మార్కెట్ రాకలు తగ్గినట్లు సమాచారం. కర్నూలు మార్కెట్‌లో సెప్టెంబర్ 16న ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.4,329గా నమోదైంది. సరఫరా పరిస్థితులు మెరుగుపడే వరకు మరో నెల రోజుల పాటు ధరలు అధికంగానే ఉండొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!