

తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచ స్థాయి పోటీతత్వమే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు దేశంలో ప్రముఖ గమ్యస్థానంగా ఎదిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డీఈ షా మూడు దశాబ్దాల ప్రస్థానం నగరంపై, తెలంగాణలోని ప్రతిభావంతులైన మానవ వనరులపై సంస్థకు ఉన్న దీర్ఘకాలిక నమ్మకానికి నిదర్శనమని అన్నారు. సంస్థ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్లు, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్లు, మొత్తం బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ సామర్థ్యాన్ని తొలినాళ్లలోనే గుర్తించిన ప్రపంచస్థాయి ఆర్థిక, సాంకేతిక సంస్థల్లో డీఈ షా ఒకటని శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. 1996లో సుమారు 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన సంస్థ, ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్‌లలో 2,000 మందికి పైగా ఉద్యోగులతో విస్తరించిందని తెలిపారు. టెక్నాలజీ, ఫైనాన్షియల్ రీసెర్చ్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, కార్పొరేట్ విభాగాల్లో సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోందన్నారు. నియోపొలిస్‌లో డీఈ షా ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాలయాన్ని స్వాగతించిన మంత్రి.. ఇది హైదరాబాద్, తెలంగాణ భవిష్యత్ వృద్ధిపై సంస్థకు ఉన్న నమ్మకానికి సంకేతమని అన్నారు. ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార నిర్వహణలో సౌలభ్యం, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!