

వేశ్యాగృహాల నిర్వాహకులు, మానవ అక్రమ రవాణాకు గురైన బాధితులను ఒకే విధంగా చూడలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. లైంగిక దోపిడీకి గురైన బాధితులు నివసించే రక్షిత గృహాల్లో నిందితులను, వేశ్యాగృహాల నిర్వాహకులను ఉంచడం వల్ల బాధితులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల వీరికి వేర్వేరు నిర్భంధ కేంద్రాలు ఉండాలని స్పష్టం చేసింది. బాధితుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఓ వేశ్యాగృహ నిర్వాహకురాలిని లైంగిక దోపిడీ బాధితులు ఉండే రక్షిత గృహంలో ఉంచాలంటూ నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషీ, జస్టిస్ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వేశ్యాగృహాల నిర్వాహకులు, బాధితులను ఒకే రక్షిత గృహంలో ఉంచరాదని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్‌వోపీ) పంపాలని ప్రభుత్వానికి సూచించింది. వేశ్యాగృహాల నిర్వహణ కోసం ఇళ్లను అద్దెకు ఇవ్వకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, జిల్లాలవారీగా చట్టబద్ధంగా నిర్వహిస్తున్న రక్షిత గృహాలు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలని పోలీసులకు సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!