

వరంగల్ జిల్లా రంగశాయిపేటలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల తనను తీవ్రంగా కలచివేసిన వార్తల్లో ఇదొకటని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. వారానికి రూ.750 అప్పు చెల్లించలేక దంపతులు ప్రాణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తమ తర్వాత పెంపుడు కుక్కకు ఆహారం ఎవరు పెడతారనే ఆందోళనతో దానిని కూడా చంపేయడం మరింత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాల కష్టాలను వివరిస్తూ వారు రాసిన సూసైడ్ నోట్ తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లకు బానిసలై అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న వారి పరిస్థితిపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బందిలో కూడా కొందరు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, మనోధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్నవారు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని ఆయన సందేశం గుర్తుచేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!