

అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజా రాణికి ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున మాట్లాడే అవకాశం లభించింది. భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఉన్న ఆమె.. పరిపాలనా, బడ్జెట్ వ్యవహారాలను చూసే ఐరాస ఐదో కమిటీలో ప్రసంగించారు. ‘పని సంస్థీకరణ’ అంశంపై భారత్ తరఫున మాట్లాడిన తనూజా రాణి.. ఐరాస సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, సమర్థతను మరింత పెంచేలా సంస్కరణలు కొనసాగాలని సూచించారు.
ఐరాస కార్యక్రమాలు, కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సభ్య దేశాలు తమపై విధించిన ఆర్థిక చెల్లింపులను నిర్ణీత గడువులోగా పూర్తిగా చెల్లించాలని తనూజా రాణి కోరారు. ఐరాస అభివృద్ధి కార్యక్రమాలకు తగినన్ని నిధులు అందించాల్సిన అవసరాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఐదో కమిటీ చర్చలు, నిర్ణయాల్లో సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ అభిప్రాయాన్ని వెల్లడించారు. సభ్య దేశాల మధ్య సమన్వయం, సహకారంతో ఐరాస పనితీరును మరింత సమర్థవంతంగా మార్చవచ్చని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!