

బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాలు జాతీయ క్రీడా పాలనా చట్టం-2025 పరిధిలోకి ఎందుకు రాకూడదో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీసీసీఐకి సంబంధించి పలు క్రికెట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ మోహన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఏ పరిధిలో లేదని గుర్తించిన ధర్మాసనం.. ఈ మినహాయింపునకు కారణాలను వివరించాలని సంబంధిత వర్గాలను కోరింది.
దేశంలోని క్రీడా సమాఖ్యల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనను పెంపొందించేందుకు జాతీయ క్రీడా పాలనా చట్టాన్ని తీసుకొచ్చారు. పలు జాతీయ క్రీడా సమాఖ్యలు ఈ చట్టం పరిధిలో ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం దాని పరిధికి వెలుపలే ఉంది. బీసీసీఐ పరిపాలనపై సుప్రీంకోర్టు గతంలోనూ జోక్యం చేసుకుంది. లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా పలు సంస్కరణలు అమలు చేసింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన స్వయంప్రతిపత్తి సంస్థగా బీసీసీఐపై నేరుగా ప్రభుత్వ నియంత్రణ లేకపోయినా, కోర్టుల పరిధిలో ఉంటుంది. క్రీడా విధానాలు, పన్నులు, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అనుమతులు వంటి అంశాల్లో ప్రభుత్వ సంస్థలతో బీసీసీఐ సమన్వయం చేసుకుంటుంది. మరోవైపు, జాతీయ క్రికెట్ బోర్డులపై ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఐసీసీ నిబంధనలు పేర్కొంటాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!