

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మాచవరంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో రెవెన్యూ శాఖలో డబ్బులు ఇవ్వకపోతే పనులు జరగవనే అపవాదు ఉండేదని, ఆ పరిస్థితిని మార్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, భూములకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పటిష్టమైన రీసర్వే నిర్వహిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు 36 లక్షల మందికి పాస్‌పుస్తకాలు అందించామని, వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని విధానాలను రూపొందించడమే నిజమైన పాలన అని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం సూపర్ సిక్స్, పీ4 వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలంతా గౌరవప్రదంగా జీవించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా రైతులకు చంద్రబాబు చేతుల మీదుగా పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!