

భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ మరో అరుదైన ఘనతను సాధించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్లో ఉన్న టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (TACDE)లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, భారత వాయుసేన చరిత్రలో తొలి మహిళా 'టాప్ గన్'గా నిలిచారు. 20 వారాలపాటు సాగే ఈ కఠినమైన శిక్షణకు అత్యంత ప్రతిభావంతులైన ఫైటర్ పైలట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. యుద్ధ వ్యూహాలు, ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-గ్రౌండ్ ఆపరేషన్లు, సంక్లిష్ట పోరాట మిషన్లకు నాయకత్వం వంటి అంశాల్లో ఈ కోర్సు ప్రత్యేక శిక్షణ అందిస్తుంది.
2016లో అవని చతుర్వేది, మోహనా సింగ్తో కలిసి భారత వాయుసేన తొలి మహిళా ఫైటర్ పైలట్లలో ఒకరిగా ఎంపికైన భావనా కాంత్ అప్పటి నుంచి వరుస విజయాలతో చరిత్ర సృష్టిస్తున్నారు. 2019లో పగటిపూట యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి పొందిన తొలి భారత మహిళగా నిలిచిన ఆమె, మిగ్-21 బైసన్, సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలను విజయవంతంగా నడిపారు. 2020లో నారీ శక్తి పురస్కారం అందుకున్న భావనా, ఇప్పుడు తొలి మహిళా 'టాప్ గన్'గా నిలిచి భారత వాయుసేనలో మహిళల ప్రతిభకు మరో మైలురాయిని సృష్టించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!