

ప్రముఖ జర్మన్ టెక్నాలజీ సంస్థ ఎస్ఏపీ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 వేల ఉద్యోగాలను తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. 2024లోనూ ఎస్ఏపీ ఇదే స్థాయిలో ఉద్యోగాల కోత చేపట్టడంతో తాజా పరిణామం టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఎస్ఏపీలో ప్రపంచవ్యాప్తంగా 1.13 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, భారత్‌లోనే సుమారు 18 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. తాజా కోతల ప్రభావం భారతీయ ఉద్యోగులపై ఎంతవరకు ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వివిధ టెక్ సంస్థలు కలిపి 1.5 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఐటీ ఉద్యోగ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!