

తిరుపతిలో మాట్లాడిన రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పురుషోత్తం రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సమర్థించారు. ఇది అక్రమ ప్రాజెక్టు కాదని, రాయలసీమ నీటి హక్కులను కాపాడుకునేందుకు చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గమని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తున్న వారు తెలంగాణలోని ప్రాజెక్టులపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న 512 టీఎంసీల హక్కును కాపాడుకోవాలని, నీటి కేటాయింపుల పునఃసమీక్షను అంగీకరించకూడదని పురుషోత్తం రెడ్డి అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో వరద ప్రవాహం ఉండే రోజులు తగ్గుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి, నీటి విడుదలపై సమీక్ష జరగాలని కోరారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, గోదావరి–కావేరి అనుసంధానం ఒక్కటే రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. తుంగభద్ర, శ్రీశైలం నీటి హక్కుల పరిరక్షణకు టీడీపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ప్రభుత్వాలు మారినా ప్రజల నీటి హక్కులు మారకూడదని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!