

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా మూడు కొత్త పాలసీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (AVGC-XR), రోబోటిక్స్, సెమీకండక్టర్ రంగాలకు ప్రత్యేక విధానాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అమరావతిలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏవీజీసీ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఆధునిక డిజిటల్ టెక్నాలజీల్లో పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త అవకాశాలను సృష్టించడం ఈ పార్కు ప్రధాన లక్ష్యంగా ఉంది.
మరోవైపు, రాష్ట్రంలో రోబోటిక్స్ తయారీ, పరిశోధన రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రంగాల్లో కొత్త సంస్థలను ఆకర్షించడంతో పాటు సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వనుంది. అలాగే సెమీకండక్టర్ పార్కు ఏర్పాటుకు ఏకంగా 5 వేల ఎకరాలను కేటాయించింది. చిప్‌ల తయారీ, అనుబంధ పరిశ్రమల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. ఈ మూడు పాలసీల అమలుతో ఏపీని ఆధునిక సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!