

తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన సూరసంహారం వేడుకల్లో చోటుచేసుకున్న ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. నవంబర్ 15న జరిగిన ఈ వేడుకల సందర్భంగా గాయకుడు వేల్ మురుగన్ తొలుత మురుగన్ స్వామిని స్తుతిస్తూ ‘అరోహరా’ నినాదాలు చేశారు. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, హిందూ ధర్మాదాయ శాఖ మంత్రి రమేష్ పేర్లతోనూ అదే నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, పలువురు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఆలయ వేడుకలో భక్తి నినాదాలను రాజకీయ నాయకుల ప్రశంసల కోసం ఉపయోగించడాన్ని ‘చీపెస్ట్ పాలిటిక్స్’గా అభివర్ణించింది. ముఖ్యమంత్రి విజయ్ ఈ ఘటనకు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు, బీజేపీ నేత కె. అన్నామలై కూడా ఈ చర్యను ఖండించారు. ‘అరోహరా’ అనేది మురుగన్ స్వామిని స్తుతిస్తూ భక్తులు చేసే పవిత్ర నినాదమని, దాన్ని రాజకీయ నాయకుల కోసం ఉపయోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనతో మతపరమైన వేడుకల్లో రాజకీయ ప్రశంసలకు చోటు కల్పించడంపై చర్చ మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!