

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారితీశాయి. సుస్మిత చేసిన విమర్శలు, ఆరోపణలను పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని సుస్మిత ప్రకటించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మూడు రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి ములుగు, పరకాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే స్థానిక మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో కొండా సురేఖకు విభేదాలు ఉన్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరకాల సభలో వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు. మరుసటి రోజే గీసుకొండలో జరిగిన సభలో సుస్మిత సీఎం, స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తానెలా బాధ్యురాలినని సురేఖ పార్టీకి వివరణ ఇచ్చినట్లు సమాచారం. సురేఖ వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఎవరికి వారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకటించడం సరికాదని, టికెట్లపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. తాజా పరిణామాలతో కొండా సురేఖ కుటుంబానికి, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య వ్యవహారం రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!