

మహారాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నడుస్తున్న బైక్ ట్యాక్సీలన్నింటినీ 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. 2027 జూలై నాటికి ఈ మార్పును పూర్తి చేయాలని గడువు విధించింది. ప్రస్తుతం పెట్రోల్ బైక్‌లతో సేవలు అందిస్తున్న ఆపరేటర్లకు తొలి దశలో ఆరు నెలల సమయం ఇవ్వగా, 2025 మహారాష్ట్ర బైక్ ట్యాక్సీ నిబంధనల కింద తాత్కాలిక లేదా ప్రొవిజనల్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసిన వారికి మరో మూడు నెలల అదనపు గడువు ఇచ్చింది. దీంతో మొత్తం తొమ్మిది నెలల దశలవారీ మార్పిడి వ్యవధి లభించనుంది.
ఈ నిర్ణయంపై బైక్ ట్యాక్సీ డ్రైవర్లు, సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగోలు భారం, తగినంత ఛార్జింగ్ మౌలిక వసతులు లేకపోవడం వంటి సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు. మహారాష్ట్ర బైక్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు 18 నెలల గడువు కోరగా, అగ్రిగేటర్లు 2030 వరకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం తొమ్మిది నెలల గడువునే నిర్ణయించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!