

హైదరాబాద్‌లో జరగనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హైటెక్స్ ప్రాంగణంలో రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఆధునిక సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రత్యేక టెక్నికల్ ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు.
ఈ ఎక్స్‌పోలో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐఆర్‌సీ సదస్సు నాలుగుసార్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఒకసారి నిర్వహించామని, ఇప్పుడు రెండోసారి తెలంగాణలో ఈ సదస్సు జరుగుతోందని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యానికి పూర్వం 1938లో దక్కన్ సంస్థానం కాలంలో ఐఆర్‌సీ నాలుగో సమావేశం తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌సీ అధ్యక్షుడు ఎల్.కే. పాండే, ప్రధాన కార్యదర్శి రాహుల్ గుప్తా, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సురేందర్, మోర్త్ తెలంగాణ ప్రాంతీయ అధికారి ఏ. కృష్ణప్రసాద్‌తో పాటు పలువురు ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!