

తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఓటర్ జాబితా ప్రక్షాళన (SIR) ప్రక్రియతో పాటు తనకు రెండు ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలపై స్పందించారు. తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు ఎవరైనా ఆధారాలు చూపితే ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకున్నానని, చరిత్ర తెలియకుండా కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
తండాల్లో నివసించే గిరిజనులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నికల సమయంలో మాత్రమే స్వగ్రామాలకు వస్తారని సీఎం తెలిపారు. అలాంటి వారి ఓట్లు జాబితా నుంచి తొలగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లకే అసలైన ఓటర్ల వివరాలు తెలుసునని పేర్కొన్నారు. నిజమైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ప్రక్షాళన ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించిన ఆయన, ప్రస్తుతం 70 శాతం సర్వే పూర్తైందని, మిగిలిన 30 శాతం త్వరలో పూర్తవుతుందని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!