

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం వరుసగా రెండో రోజు నిరసనలు కొనసాగాయి. ఆంక్షలను ఉల్లంఘించి నిరసనకు ప్రయత్నించిన సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు ఉన్నారు. కపిల్ సిబల్, నిత్యా రామకృష్ణన్, పల్లవ్ శిశోదియా తదితరులు కూడా నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు.
జ్ఞానేశ్‌కుమార్ పదవి నుంచి వైదొలగకపోతే అక్టోబర్ 10న దిల్లీలో శాంతియుత నిరసన నిర్వహిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. దేశంలో పారదర్శక ఎన్నికలు కోరుకునే పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. మరోవైపు, అక్టోబర్ 2న ముంబయిలో జరిగిన నిరసనలో మైనర్లు పాల్గొన్నారన్న ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. మైనర్ల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారన్న ఆరోపణలపై కూడా వివరాలు కోరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!