

రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును మళ్లీ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మహారాష్ట్రతో ఉన్న వివాదాల కారణంగా నిలిచిపోయిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ అంశాన్ని మరోసారి ముందుకు తీసుకువచ్చి, అక్కడి నుంచి సుందిళ్లకు జలాలను తరలించే ప్రణాళికపై ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా సీఎం ఈ అంశాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ ఎత్తుపై గతంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సమ్మతి లభిస్తే ప్రాజెక్టుకు తుదిరూపు ఇచ్చి కేంద్ర జలవనరుల సంఘం అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నారు. ప్రాణహిత జలాలను సుందిళ్లకు తరలించి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోసే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.
ప్రాజెక్టు పురోగతిపై స్థల పరిస్థితులను పరిశీలించేందుకు నేడు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అధికారులు వారికి నీటి లభ్యత, నిర్మాణ అవకాశాలపై వివరాలు అందించనున్నారు. ఈ పర్యటన అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా చర్చలు జరపనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!