

తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. గణేష్, భవానీ దంపతుల కుమార్తె అయిన జ్ఞానేశ్వరి తోటలోని నివాసం వద్ద నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. తోటలు, కొండ ప్రాంతాలు, అటవీ సరిహద్దులు, పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. అడవి జంతువుల కదలికలను గుర్తించేందుకు నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేయగా, గుబురు గడ్డిని ట్రాక్టర్లతో తొలగిస్తూ శోధన కొనసాగిస్తున్నారు.
డీఎస్పీ తిలక్ మాట్లాడుతూ, ప్రమాదం, అపహరణ, అడవి జంతువుల దాడి వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నక్కపల్లి, యలమంచిలి వరకు విస్తరించిన కొండ ప్రాంతాలను పరిశీలించామని, గ్రామంలోని 470 ఇళ్లలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఆటో డ్రైవర్లు, వాహనదారులు, గ్రామం నుంచి ఇటీవల బయటకు వెళ్లిన వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చెందుతుండగా, ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!