

ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్‌లో రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్ర యువతకు ఈ విమానాశ్రయం అభివృద్ధికి కొత్త అవకాశాల ద్వారమవుతుందని పేర్కొంటూ, అల్లూరి సీతారామరాజు పేరుతో విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు. అలాగే 13,500 మందికి పైగా గిరిజన మహిళలు థింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించినందుకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమలు, కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, పోర్టులు, రైల్వేలు, జాతీయ రహదారులు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని మోదీ చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ఆసియాలో కీలక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గత మూడు సంవత్సరాల్లో తన పర్యటనల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పెట్టుబడులు పెరిగితే ఉత్పత్తి, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!