

కార్పొరేట్ పన్ను తగ్గింపుతో కంపెనీలు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీతో ఉద్యోగులు ప్రయోజనం పొందుతున్న నేపథ్యంలో.. సంస్థలు తమ ఉద్యోగుల జీతాలు పెంచడంతో పాటు కొత్త నియామకాలను విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఫిక్కీ వార్షిక సదస్సులో ప్రసంగించిన ఆయన.. కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం, కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచడం వంటి నిర్ణయాలను ప్రస్తావించారు. పన్ను తగ్గింపుల ద్వారా కంపెనీలు, వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నప్పుడు.. ఆ ప్రయోజనాలకు అనుగుణంగా సంస్థలు ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నాయా? కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయా? అని ప్రశ్నించారు.
తక్కువ పన్నుల రూపంలో కంపెనీలకు లభిస్తున్న ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, మెరుగైన వేతనాలు అందించడంతో పాటు నియామకాలను పెంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఆదాయం పెరిగేలా, మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడేలా కార్పొరేట్ రంగం చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పన్ను సంస్కరణలకు కంపెనీలు కూడా తోడ్పాటునందిస్తే.. కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం చేకూరుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!