

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గత నెల జరిగిన ఘటనకు సంబంధించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కారుపై దాడి జరిగినట్లు ఫిర్యాదు అందడంతో ఈ చర్యలు తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.
గాంధీ భవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎంపీ వంశీకృష్ణ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం గడ్డం త్రిమూర్తి, అక్కల వెంకటేశ్వర్లు, అంకతి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, లక్కకుల సృజన్, ఆకుల దుర్గ ప్రసాద్‌లకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. ఇతర ఫిర్యాదులపై కూడా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేసినట్లు మల్లు రవి తెలిపారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు. తనపై కూడా ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. పార్టీ నాయకుల మధ్య సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని హైకమాండ్ ఆదేశించిందని తెలిపారు. ఫిర్యాదులు ఉంటే గాంధీ భవన్‌కు వచ్చి చెప్పుకోవాలని, ధర్నాలు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!