

కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టడీ టూర్‌లో భాగంగా జర్మనీకి చేరుకున్న తెలంగాణ లేజిస్లేచర్ ప్రతినిధులకు బెర్లిన్ విమానాశ్రయంలో తెలంగాణ విద్యార్థులు, ప్రవాస తెలంగాణవాసులు ఆత్మీయ స్వాగతం పలికారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కుమార్‌కు విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతించారు. ఈ విదేశీ స్టడీ టూర్‌లో జర్మనీతో పాటు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లోనూ ప్రతినిధి బృందం పర్యటించనుంది.
పర్యటనలో భాగంగా ఆయా దేశాల్లోని పార్లమెంటరీ వ్యవస్థలు, శాసనసభల పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, శాసన వ్యవహారాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. ప్రజాప్రతినిధుల విధులు, శాసన ప్రక్రియలు, పార్లమెంటరీ విధానాలను పరిశీలించడంతో పాటు తమ అనుభవాలను అక్కడి ప్రతినిధులతో పంచుకోనున్నారు. తెలంగాణ లేజిస్లేచర్ CPA శాఖకు గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ కీలక బాధ్యతల్లో ఉన్నట్లు CPA అధికారిక వివరాలు పేర్కొంటున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!