

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, మిగిలిన ఇద్దరు కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఈసీ తోసిపుచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్.సంధూ, వివేక్ జోషి సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తూ.. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ పూర్తి కమిషన్ ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం జరిగిన పూర్తిస్థాయి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. గత ఏడాది కాలంలో కమిషన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఉన్నాయని ఈసీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ చేపట్టే విషయంలోనూ కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని ఈసీ తెలిపింది. బిహార్, పశ్చిమబెంగాల్‌తో పాటు మరో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ నిర్వహించేందుకు ప్రకటనలు జారీ చేసినట్లు పేర్కొంది. మూడో దశలో 12 రాష్ట్రాల్లో ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఓటర్ల తుది లెక్కలు వెల్లడవుతాయని తెలిపింది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నోటీసులు అందుకున్న వారి ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి పత్రాలు సేకరిస్తారని, అవసరమైతే ఈఆర్‌ఓ విచారణను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చని వివరించింది. కొత్త ఓటర్లు, జాబితాలో పేర్లు లేని వారు ఈఆర్‌ఓకు దరఖాస్తు చేసుకోవచ్చని, నిరాశ్రయులు, కూలీలు, నైట్ షెల్టర్లలో నివసించే వారి కోసం అవసరమైన మేరకు హెల్ప్‌డెస్కులు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!