

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమనౌక అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. భూమి నుంచి ఒక లైట్ డే దూరం అంటే సుమారు 2,600 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి, ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించింది. ఒక రోజులో కాంతి ప్రయాణించే దూరాన్నే లైట్ డేగా పరిగణిస్తారు. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయేజర్-1 ప్రస్తుతం గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకెళ్తోంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రయాణం కొనసాగిస్తున్న ఈ వ్యోమనౌక మానవ అంతరిక్ష పరిశోధన సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
సౌర వ్యవస్థలోని బయటి గ్రహాలతో పాటు సూర్యుడి హెలియోస్పియర్‌కు ఆవల ఉన్న నక్షత్రాల మధ్య అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేసేందుకు నాసా వాయేజర్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 1977 సెప్టెంబర్ 5న వాయేజర్-1ను ప్రయోగించింది. తన ప్రయాణంలో భాగంగా 1979లో గురుగ్రహాన్ని, 1980లో శనిగ్రహాన్ని సమీపించి కీలక పరిశోధనలు చేపట్టింది. అనంతరం 2012లో సౌర వ్యవస్థను చుట్టుముట్టే హెలియోస్పియర్ సరిహద్దును దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. ఒక కాంతి సంవత్సరం దూరాన్ని చేరుకోవడానికి ఈ వ్యోమనౌకకు మరో 18 వేల సంవత్సరాలు పట్టవచ్చని నాసా అంచనా వేస్తోంది. తాజా ఘనత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో కీలక అధ్యాయంగా నిలిచిపోనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!