

అమరావతిలో సింగపూర్‌లోని పుంగోల్ ప్రాంతం తరహాలో సమగ్ర టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ టౌన్షిప్ ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. దీనికి అవసరమైన మద్దతును ప్రపంచ బ్యాంకు నుంచి పొందుతూ, విధి విధానాల ఖరారును వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం సింగపూర్‌లో వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని కోరుతూ, ఆసక్తి గల భాగస్వాముల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ఇప్పటికే నోటీసు విడుదల చేసినట్లు తెలిపారు. అమరావతికి జాతీయ చట్టబద్ధత లభించడం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యానికి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సింగపూర్ తరహాలో అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించే కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యక్ష పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!