

అమెరికాలో మీజిల్స్ (తట్టు) వ్యాధి వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు వేలకు పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. 1991 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. పెన్సిల్వేనియాలోనే సుమారు 1,500 కేసులు గుర్తించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో మీజిల్స్ వ్యాధిని నిర్మూలించిన దేశంగా అమెరికా సాధించిన స్థాయి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న టీకా విధానాలు వ్యాధి వ్యాప్తికి దోహదపడుతున్నాయని కొందరు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ ఎరికా ష్వార్ట్‌జ్ వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరంలో కిండర్‌గార్టెన్ విద్యార్థుల్లో 92.4 శాతం మందికి మీజిల్స్, మంప్స్, రుబెల్లా (ఎంఎంఆర్) టీకాలు ఇచ్చినట్లు సీడీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ శాతం 2019–20 విద్యా సంవత్సరంతో పోలిస్తే 3.1 శాతం తగ్గింది. మీజిల్స్ వ్యాప్తిని అడ్డుకోవడానికి జనాభాలో కనీసం 95 శాతం మందికి టీకాలు వేయడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!